Secret data : తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వానికి చేరిందన్న వార్త రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే వెల్లడించిన కథనం ప్రకారం.. తమిళనాడు ప్రభుత్వానికి చెందిన పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ నుంచి కీలకమైన సమాచారం బయటకు లీకైనట్లు తెలుస్తోంది. పెట్టుబడుల ప్రతిపాదనలు, వివిధ కంపెనీలతో జరుగుతున్న చర్చలు, రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇతర రాష్ట్రాలకు చేరాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం సుమారు 15 మంది అధికారులను విధుల నుంచి తొలగించినట్లు కథనంలో పేర్కొంది. రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం బయటకు వెళ్లడం పారిశ్రామిక రంగంలో కలకలం రేపుతోంది. అయితే డేటా లీక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దాని వెనుక ఉన్న వ్యక్తుల పాత్రపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

కొరియా పెట్టుబడుల తరలింపుతో అనుమానాలు!
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తొలగించిన 15 మంది అధికారుల్లో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నట్లు ఇండియా టుడే కథనం వెల్లడించింది. దీంతో తమిళనాడు నుంచి ఏపీకి పెట్టుబడుల సమాచారం చేరిందన్న ఆరోపణలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన హ్వాషిన్, సియోన్, ఐవామెట్ సంస్థలకు సంబంధించిన సుమారు రూ.1,600 కోట్ల పెట్టుబడులు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడుల వ్యవహారానికి, తాజా డేటా లీక్ ఆరోపణలకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ మొదలైంది. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, తమిళనాడుతో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పెట్టుబడుల తరలింపునకు డేటా లీక్ కారణమని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఈ ఆరోపణలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అధికారిక వివరణ కీలకంగా మారనుంది.