Cyclone Akwan: దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను క్రమంగా మరింత బలపడుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తుపాను, మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ముంచుకొస్తున్న తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ పనుల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Cyclone Akwan: నెల్లూరు తీరంలో అల్లకల్లోలం
అక్వాన్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. గంటగంటకూ అలల ఉద్ధృతి పెరుగుతుండటంతో, పలుచోట్ల సముద్రపు నీరు 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు తీరంలోకి చొచ్చుకువచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు సముద్రంలోకి చేపలవేటను తక్షణమే నిలిపివేశారు. జువ్వలదిన్నె హార్బర్లో 80కి పైగా మరబోట్లను సురక్షితంగా లంగరు వేయించారు. తీర ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
తుపాను నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం తీర ప్రాంతాల్లో పటిష్ఠమైన రక్షణ చర్యలు చేపట్టింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు, ఈ తుపాను వల్ల కురిసే వర్షాలతోనైనా సోమశిల, కండలేరు జలాశయాలు నిండితే తమకు తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని నెల్లూరు జిల్లా స్థానిక ప్రజలు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.