Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అక్వాన్’ (Akvan) తీరం దిశగా వేగంగా దూసుకొస్తోంది. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నానికి మచిలీపట్నం – పూరి మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

Cyclone Akvan: ప్రస్తుతం ఎక్కడుంది? తీరం దాటే సమయంలో గాలుల వేగం ఎంత?
దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర తుఫాను గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పున 570 కి.మీ., విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 580 కి.మీ., మచిలీపట్నానికి ఆగ్నేయంగా 590 కి.మీ., ఒడిశాలోని పూరికి దక్షిణంగా 770 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 20న తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెను ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
తీవ్ర తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గతంలో ‘అర్నబ్’ తుఫాను తరహాలోనే దీని తీవ్రత ఉండే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు జారీ చేసింది.
తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలకు ఛాన్స్
అక్వాన్ తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ, రేపు మరియు ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్లుండి రాష్ట్రంలోని ఒకటి రెండు తూర్పు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు.