Manu Bhaker: భారత స్టార్ షూటర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ISSF) అథ్లెట్స్ కమిటీ సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. 2026-2030 కాలానికి ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. మంగళవారం (నవంబర్ 17) నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది.
పిస్టల్ విభాగం నుంచి ఎన్నిక
ISSF అథ్లెట్స్ కమిటీ ఎన్నికల్లో మను భాకర్ పిస్టల్ విభాగం నుంచి పోటీ చేశారు. ఈ విభాగంలో రెండు స్థానాల కోసం పది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల సందర్భంగా అర్హత కలిగిన అంతర్జాతీయ షూటర్లు ఆన్లైన్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మను కమిటీలో స్థానం సంపాదించారు.
క్రీడాకారుల సమస్యలకు ప్రాతినిధ్యం

ISSF అథ్లెట్స్ కమిటీ అంతర్జాతీయ షూటింగ్ క్రీడాకారులకు, సమాఖ్యకు మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. పోటీల నిర్వహణ, నిబంధనలు, అథ్లెట్ల సంక్షేమం వంటి అంశాలపై క్రీడాకారుల అభిప్రాయాలను సమాఖ్య దృష్టికి తీసుకెళ్లడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు, ఆర్థిక అవకాశాలు, సంక్షేమ వ్యవస్థలు కల్పించడంతో పాటు వారి సమస్యలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా కృషి చేయడం ఈ కమిటీ బాధ్యతల్లో భాగం.
Manu Bhaker: ఇప్పటికే ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మను
మను భాకర్ ఇప్పటికే తన అద్భుత ప్రదర్శనతో భారత షూటింగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన స్వతంత్ర భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. తాజాగా ISSF అథ్లెట్స్ కమిటీలో సభ్యురాలిగా ఎన్నిక కావడంతో ఆమె కెరీర్లో మరో కీలక ఘట్టం నమోదైంది.