న్యూఢిల్లీ: ఒక బట్టల షాప్‌లో పనిచేస్తున్న యువతి అక్కడి ట్రయల్ రూమ్‌లో హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఆ షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువతితో పరిచయం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Woman murdered in trial room) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మోతీ నగర్‌లోని ఒక దుస్తుల షాపులో 18 ఏళ్ల షబ్నమ్ పని చేస్తున్నది. శనివారం రాత్రి ఆ షాపు మూసే సమయానికి ఆ యువతితో పరిచయం ఉన్న సూరజ్ అక్కడకు చేరుకున్నాడు. మాట్లాడే నెపంతో ఆ షాపులోని ట్రయల్ రూమ్‌కు ఆమెను తీసుకెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో షబ్నమ్ గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, షాపులోని ఆ ట్రయల్ రూమ్ నుంచి రక్తం రావడాన్ని సిబ్బంది గమనించారు. డోర్ తీసి చూడగా రక్తం మడుగులో షబ్నమ్ మృతదేహం ఉండటం చూసి వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ షాపులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. షబ్నమ్తో పరిచయం ఉన్న సూరజ్ ఆ సమయంలో ఆ షాపు వద్దకు రావడంతో ఆమెను హత్య చేసినట్లు అనుమానించారు. అతడు గతంలో కూడా ఆమెపై భౌతిక దాడికి పాల్పడినట్లు యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. షబ్నమ్ హత్య తర్వాత ఇంటి నుంచి పారిపోయిన అతడిని ఢిల్లీ పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.