కోల్‌కతా: సహజీవనం చేసిన మహిళ బ్రేకప్ చెప్పడంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆమె పెంపుడు కుక్కలను క్రూరంగా చంపాడు. ఆ మహిళకు వీడియో కాల్ చేసి దీనిని చూపించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (man kills live-in partner’s dogs) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. సంజీబ్ భట్టాచార్య, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పరి నోవా కలిసి సహజీవనం చేశారు. దక్షిణ కోల్‌కతాలోని విక్రమ్‌గఢ్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో వారిద్దరూ నివసించారు. అయితే సంజీబ్ వేధిస్తుండటంతో భరించలేని పరి నోవా అతడికి బ్రేకప్ చెప్పింది. ఆ ఇంటిని ఆమె వీడింది.
కాగా, నవంబర్ 14న పరి నోవాకు చెందిన రెండు పెంపుడు కుక్కలను సంజీబ్ భట్టాచార్య దారుణంగా చంపాడు. ఆమెకు అతడు వీడియో కాల్ చేశాడు. ఉరికి వేలాడిన ఒక పెంపుడు కుక్కను చూపించాడు. ఆందోళన చెందిన పరి నోవా వెంటనే స్థానిక వ్యక్తికి ఫోన్ చేసింది. ఆ ఫ్లాట్‌కు వెళ్లి చూడమని కోరింది. ఆ వ్యక్తి ఫ్లాట్‌కు చేరుకోగా రెండు పెంపుడు కుక్కలు చనిపోయి ఉన్నాయి. ఆ ఫ్లాట్ అంతటా రక్తపు మరకలు ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంజీబ్ను అరెస్ట్ చేశారు.
మరోవైపు జంతు హక్కుల కార్యకర్తలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు పెంపుడు కుక్కల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫ్లాట్‌లో ఇతర పెంపుడు జంతువులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వాటిని కూడా చంపేందుకు నీటిని అతడు మరిగించినట్లు వారు ఆరోపించారు. పెంపుడు కుక్కలను క్రూరంగా చంపిన సంజీబ్ భట్టాచార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే సహజీవనం చేసిన సంజీబ్ వల్ల తాను శారీరక హింసకు గురైనట్లు పరి నోవా ఆరోపించింది. దీంతో ప్రాణ భయంతో తాను అపార్ట్‌మెంట్‌ను విడిచి వెళ్లినట్లు ఆమె తెలిపింది. ‘గత ఆరేడు నెలలుగా నన్ను దాదాపు ప్రతిరోజూ కొట్టేవాడు. ఇల్లు వదిలి వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అతడు నన్ను అన్ని విధాలుగా హింసించాడు. నన్ను చంపేసేవాడు కూడా’ అంటూ మీడియా ముందు ఆమె వాపోయింది.
అలాగే సంజీబ్ భట్టాచార్య తన సోదరుడిపై తప్పుడు కేసు నమోదు చేయించినట్లు పరి నోవా ఆరోపించింది. ‘కొన్ని నెలల కిందట అతడు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్పటి నుంచి నా సోదరుడిపై కేసు నడుస్తోంది. అతడు ఒక సైకో’ అని ఆమె విమర్శించింది.