Pension : చేయూత పెన్షన్ల పెంపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న చేయూత పెన్షన్లను ప్రస్తుతమున్న రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న రూ.2 వేల పెన్షన్ ఏ అవసరానికీ సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర పెన్షన్ లబ్ధిదారులు తమ రోజువారీ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని, వాస్తవానికి రూ.5 వేల పెన్షన్ ఇచ్చినా తక్కువేనని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రంలో మరోసారి చేయూత పెన్షన్ల పెంపు అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

పెన్షన్ల పెంపు సాధ్యమేనా.. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత?
మరోవైపు పెన్షన్ల పెంపు ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంపై అప్పుల భారం కూడా పెరుగుతున్న నేపథ్యంలో పెన్షన్లను రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచితే ప్రభుత్వ ఖజానాపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ మొత్తాన్ని పెంచితేనే పేద, బలహీన వర్గాలకు కొంత ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని మరో వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన డిమాండ్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? చేయూత పెన్షన్లను పెంచే దిశగా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.