Bellampalli Police Video: మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి పోలీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు విధులను పక్కనపెట్టి ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకోవడం వివాదానికి దారితీసింది. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పలువురు పోలీసులు, మహిళా సిబ్బంది ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అక్కడ మద్యం సేవిస్తూ రెయిన్ డ్యాన్స్‌లు చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించారు.

ఫామ్‌హౌస్‌లో పోలీసుల జల్సా.. వైరల్‌గా వీడియోలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పలువురు సిబ్బంది తాండూరు మండలం కత్తెర్ల సమీపంలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ జరిగిన బర్త్‌డే వేడుకల్లో పాల్గొని విందు వినోదాలు చేసుకున్నారు. ఈ పార్టీలో పురుష పోలీసులతో పాటు మహిళా సిబ్బంది కూడా పాల్గొన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన రెయిన్ డ్యాన్స్‌లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొంటూ స్టెప్పులు వేశారు. స్విమ్మింగ్ పూల్‌లోనూ సందడి చేశారు. ఈ దృశ్యాలు బయటకు రావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతి లేకుండానే స్టేషన్ దాటి వెళ్లారా?
ఈ ఘటనలో మరో కీలక అంశం పోలీసుల విధులకు సంబంధించినది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్లలో సంతకాలు చేసి, ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే పార్టీకి వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా స్టేషన్ నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా నమోదు చేయాల్సిన మూవ్‌మెంట్ ఎంట్రీ కూడా చేయలేదని సమాచారం. పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో ఇలా వ్యవహరించడంపై అధికారులు దృష్టి సారించారు. అయితే పార్టీకి వెళ్లిన సిబ్బంది అందరూ ఆ సమయంలో విధుల్లో ఉన్నారా? సెలవులో ఉన్నారా? అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనలో రెయిన్ డ్యాన్స్ వ్యవహారం కూడా ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. ఒకవైపు ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం, అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులే ఫామ్‌హౌస్‌లో రెయిన్ డ్యాన్స్‌లు చేయడం విమర్శలకు కారణమైంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న సిబ్బంది ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి పార్టీల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం! పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ‘ఆన్ డ్యూటీ’లో ఉన్నట్లు నమోదు చేసుకుని, ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొన్న పోలీసులు. మద్యం మత్తులో డ్యాన్సులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్! #Mancherial #Bellampalli pic.twitter.com/Bexa2Jv1Ry
— Vaartha Telugu Daily (@myvaartha) November 18, 2026
Bellampalli Police Video: 12 మంది పోలీసులపై ప్రాథమికంగా గుర్తింపు
ఈ ఘటనపై ప్రాథమికంగా 12 మంది పోలీసు సిబ్బంది బర్త్‌డే పార్టీకి వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే వీరితో పాటు మరెవరైనా పాల్గొన్నారా? పార్టీకి వెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు? స్టేషన్ విధులకు ఎవరు హాజరయ్యారు? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. వీడియోల్లో కనిపిస్తున్న సిబ్బంది వివరాలు, వారి విధుల సమయాలు, స్టేషన్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యత ఎవరిదనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ఫామ్‌హౌస్ పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ నిబంధనలను ఉల్లంఘించే చర్యలను ఉపేక్షించబోమని సీపీ స్పష్టం చేసినట్లు సమాచారం.