Travis Head IPL 2027: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. తన పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు హెడ్ ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి స్పష్టం చేశాడు.
హెడ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీలలో ఒకటైన ‘ట్రావిషేక’ (ట్రావిస్ హెడ్ – అభిషేక్ శర్మ) భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. హెడ్ దూరం కావడం బ్యాటింగ్ విభాగంలో జట్టుకు పెద్ద లోటు అయినప్పటికీ, వేలం పరంగా ఫ్రాంచైజీకి ఆర్థిక ఊరట లభించనుంది. 2025 మెగా వేలానికి ముందు రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న హెడ్ తప్పుకోవడంతో, ఇప్పుడు ఆ భారీ మొత్తం తిరిగి ఎస్‌ఆర్‌హెచ్ పర్సులోకి చేరనుంది.

Travis Head IPL 2027: అంతర్జాతీయ షెడ్యూల్ ఒత్తిడే ప్రధాన కారణం
ఆస్ట్రేలియా జట్టుకు రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైన, తీరికలేని అంతర్జాతీయ షెడ్యూల్ ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్, ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్, అలాగే 2027 వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో పనిభారాన్ని తగ్గించుకోవాలని హెడ్ భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా తమకు ముఖ్యమైన క్రికెట్ రాబోతోందని, ఆటగాళ్ల ఫిట్‌నెస్ దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని గతంలోనే సంకేతాలు ఇచ్చారు.
2024 ఐపీఎల్ వేలంలో రూ.6.8 కోట్లకు సన్‌రైజర్స్ గూటికి చేరిన ట్రావిస్ హెడ్, మూడు సీజన్ల పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2024 సీజన్‌లో ఏకంగా 567 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆ తర్వాత 2025లో 374 పరుగులు, 2026 సీజన్‌లో 410 పరుగులు సాధించి తన సత్తా చాటాడు.
ట్రేడింగ్‌లో చురుగ్గా ఎస్‌ఆర్‌హెచ్.. పాత ఆటగాళ్ల రీఎంట్రీ
మరోవైపు, నేటితో ముగియనున్న రిటెన్షన్ గడువుకు ముందే సన్‌రైజర్స్ యాజమాన్యం ట్రేడింగ్ విండోలో చురుగ్గా వ్యవహరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తమ పాత పేసర్ టి. నటరాజన్‌ను తిరిగి జట్టులోకి తీసుకుని, జీషన్ అన్సారీని వదులుకుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మరో కీలక డీల్‌లో పేసర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను జట్టులోకి చేర్చుకుని, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను చెన్నైకి అప్పగించింది.