Sonia Biography Book : సోనియా గాంధీ మనసులో తెలంగాణ ఉందని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు.. ఆమె జీవిత చరిత్రలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సోనియా గాంధీ దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, రాష్ట్ర ప్రజలు సంవత్సరాల తరబడి సాగించిన అలుపెరుగని పోరాటం, చేసిన త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాకారమైందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్రను గొప్పగా చెప్పుకుంటూ, మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. నిజంగా తెలంగాణపై సోనియా గాంధీకి అంతటి అభిమానం ఉంటే, ఆమె ఆత్మకథలో రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ ప్రస్థానం గురించి ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వం, ప్రజల పోరాటం, అమరుల త్యాగాలను ఎవరూ విస్మరించలేరని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు. ఎన్నో నిరసనలు, ఆందోళనలు, త్యాగాల తర్వాతే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని వివరించారు. అలాంటి చారిత్రక ఉద్యమాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ఏర్పాటు ఘనతను పూర్తిగా కాంగ్రెస్‌కు ఆపాదించుకోవాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను, ప్రజల పోరాట స్ఫూర్తిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు. సోనియా గాంధీ జీవిత చరిత్రలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.