IPL : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా వెల్లడించింది. ఇకపై ఆటగాడిగా కాకుండా జట్టుకు మెంటార్‌గా సేవలందించనున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా చెన్నై జట్టుతో విడదీయలేని అనుబంధాన్ని కొనసాగించిన ధోనీ.. తన నాయకత్వం, వ్యూహాలు, ఆటతీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ పలుమార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆటగాడిగా ధోనీ ప్రస్థానం ముగిసి, మెంటార్‌గా కొత్త ప్రయాణం ప్రారంభం కానుందన్న వార్త క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ధోనీ లేకుండా CSK లేదు.. భావోద్వేగానికి గురైన శ్రీనివాసన్
ధోనీ రిటైర్మెంట్ వార్తపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావోద్వేగానికి గురైంది. జట్టు ఓనర్ ఎన్. శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఊహించలేమని వ్యాఖ్యానించారు. గత రెండు దశాబ్దాలుగా ధోనీ తమతో కలిసి ప్రయాణించారని, జట్టు ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. చెన్నై జట్టుతో ధోనీకి ఉన్న అనుబంధం కేవలం ఆటగాడి సంబంధం మాత్రమే కాదని, అది కుటుంబ బంధం లాంటిదని భావోద్వేగంగా స్పందించారు. CSK ఎప్పటికీ ధోనీ ఇల్లేనని స్పష్టం చేశారు. ఆటగాడిగా మైదానంలో తనదైన ముద్ర వేసిన ధోనీ.. ఇక మెంటార్‌గా జట్టుకు మార్గనిర్దేశం చేయనుండటంతో అభిమానులు ఆయన కొత్త పాత్రపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.