పాట్నా: ప్రసాదం కోసం తయారు చేసిన ఆహార పదార్థాన్ని పూజకు ముందే ఒక చిన్నారి తిన్నది. ఆగ్రహించిన తల్లి, తన కుమార్తెను కొట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక మరణించింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Mother Beats Daughter To Death) బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఛఠ్ పూజలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లల శ్రేయస్సుతో పాటు సౌభాగ్యం, దీర్ఘాయువు కోసం ఈ పూజను ఆచరిస్తారు.
కాగా, ఆదివారం రీనా కుమారి అనే మహిళ ఛఠ్ పూజ కోసం నైవేద్య పదార్థాలను సిద్ధం చేస్తున్నది. నాలుగేళ్ల కుమార్తె సుహాని కుమారి, ప్రసాదం కోసం తయారు చేసిన ఒక ఆహార పదార్థాన్ని తిన్నది. ఆగ్రహించిన తల్లి రీనా ఆ చిన్నారిని కొట్టింది. ఆ వెంటనే ఆ బాలిక ఆరోగ్యం క్షీణించింది. ఆ చిన్నారిని చికిత్స కోసం ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు సుహాని అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కుమార్తె మరణానికి కారణమైన ఆ చిన్నారి తల్లి రీనాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత, పోలీస్ విచారణ పూర్తయ్యాక ఆ చిన్నారి మరణానికి కారణం ఏమిటన్నది స్పష్టమవుతుందని పోలీస్ అధికారి తెలిపారు.
అయితే ఛఠ్ పూజ రోజున కుమార్తెను కోల్పోవడంపై ఆ చిన్నారి తండ్రి రాజు పాశ్వాన్ తీవ్ర వేదనకు గురయ్యాడు. తన కుమార్తె లేని ఈ పండుగకు ఇక ఎలాంటి అర్థం లేదని వాపోయాడు. తన భార్యకు కఠిన శిక్ష పడాలని అతడు డిమాండ్ చేశాడు. తన జీవితంలో ఆమె అవసరం లేదన్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలను తానే స్వయంగా పెంచుకుంటానని అతడు చెప్పాడు.
కాగా, రాజు పాశ్వాన్, రీనా కుమారి దంపతులకు ముగ్గురు పిల్లలు. ఏడేళ్ల శివానీ కుమారి, నాలుగేళ్ల సుహాని కుమారి, ఏడాదిన్నర వయసున్న రాజా కుమార్ ఉన్నారు. అయితే రెండో కుమార్తె సుహాని మరణంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.