గువాహటి: ఒక బాలుడు కత్తితో తల్లిపై దాడి చేసి ఆమెను తీవ్రంగా పొడిచాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఒక ప్రాంతంలోని బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Son Stabs Mother) అస్సాం రాజధాని గువాహటిలో ఇది జరిగింది. తూర్పు జ్యోతినగర్‌లోని హల్ధీ మిల్ ప్రాంతంలో నివసించే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం తల్లి చంద్రాని కలితపై కత్తితో అతడు దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా పొడిచాడు. ఆ తర్వాత ఇంటి నుంచి నుంచి బయటకు వెళ్లాడు.
కాగా, తల్లిపై కత్తితో దాడి చేసిన తర్వాత గువాహటిలోని ఏబీసీ ప్రాంతంలో ఉన్న ఒక భవనం వద్దకు ఆ బాలుడు చేరుకున్నాడు. ఆ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
మరోవైపు బాలుడి కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి చంద్రాని కలితను పొరుగువారు గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటట్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్నది. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
అయితే ఈ రెండు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలుడు తన తల్లిపై కత్తితో ఎందుకు దాడి చేశాడు? ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.